ఆర్థిక సాయం: ఇంటికి పదివేలు.. 

21 Oct, 2020 02:09 IST|Sakshi
వరద ముంపు బాధితులకు చెక్కులను అందజేస్తున్న మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు

వరద ముంపు బాధితులకు ఆర్థికసాయం అందించిన మంత్రి కేటీఆర్‌

పలు ప్రాంతాల్లో పర్యటన.. ఇంటింటికీ వెళ్లి యోగ క్షేమాల ఆరా

సాక్షి, హైదరాబాద్‌: ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వరదనీటి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి పది వేల రూపాయల చొప్పున సాయం అందిస్తామని మునిసిపల్‌ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఎమ్మెస్‌ మక్తా, షేక్‌పేట, నదీమ్‌ కాలనీ, లింగోజిగూడ, నాగోల్‌లో పర్యటించిన మంత్రి.. బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.10 వేల ఆర్థికసాయాన్ని అందచేశారు. ప్రస్తుతం అందిస్తున్న ఈ మొత్తం తక్షణ సహాయం మాత్రమేనని, వరదల్లో ఇళ్లు పాక్షికంగా, లేదా పూర్తిగా నష్టపోతే వారికి మరింత సహాయం అందిస్తామన్నారు.

నగరంలో ఎంతమంది బాధితులుంటే అందరికీ సహాయం అందాలన్న సీఎం ఆదేశాలతో నగరంలో ఈరోజు అనేకచోట్ల నగదు సహాయం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు ఈ సాయం అందుతుందన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేలా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రానున్న ఒకట్రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో వరద నివారణకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తామన్నారు. ఆయన వెంట మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సుధీర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులున్నారు.  

ప్రజలకు అండగా నిలవండి.. 
రానున్న పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ బాధితులకు భరోసానివ్వాలని మునిసిపల్‌ మంత్రి కె.తారకరామారావు సూచించారు. అలాగే, వరద బాధితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా కూడా చూడాలన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో మంత్రి ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్‌ క్యాంపుల్లో ఎటువంటి లోటు లేకుండా చూడాలన్నారు.  

సీఎం సహాయనిధికి  2 నెలల వేతనం 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ఇవ్వాలని నిర్ణయించారు. వీరిని మంత్రి కేటీఆర్‌ అభినందించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా