సినీ పరిశ్రమకు అండగా ఉంటాం

23 Nov, 2020 03:32 IST|Sakshi

కరోనాతో నష్టపోయిన నేపథ్యంలో రాయితీలు ఇస్తాం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీన్ని చేరుస్తాం 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన 

సీఎంతో పలువురు సినీ ప్రముఖుల సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోయి, థియేటర్లు మూసేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

‘‘రాష్ట్రానికి పరిశ్రమలు తరలిరావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబై, చెన్నైతోపాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ ద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినీ పెద్దలు కలసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వపరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ విడుదల చేసే మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంతో భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం చాంబర్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్‌దాస్‌ నారంగ్, కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి. కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌రెడ్డి, నిర్మాత నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై సినీ పరిశ్రమ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా