'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శ‌వాల‌ను చూడండి'

5 May, 2021 19:30 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ స్లేటర్‌ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిస‌న్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డాడు. కరోనా విజృంభణతో భారత్‌ అల్లాడిపోతుంటే.. ఐపీఎల్‌ రద్దుతో అక్కడే ఉండిపోయిన ఆసీస్‌ ఆటగాళ్లను వెనక్కి రప్పించే విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేశారు.'మాన‌వ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావ‌డం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియ‌న్ భ‌యంలో ఉన్నారన్నది నిజం. నువ్వు నీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో ఉన్న శ‌వాల‌ను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్‌ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాను' అంటూ విరుచుకుపడ్డాడు.  

మ‌రోవైపు క‌రోనాతో పోరాడుతున్న భార‌తీయుల‌కు సంఘీభావం తెలుపుతూ మరో ట్వీట్‌ చేశాడు. ''కరోనాపై మీరు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది. కరోనా బారీన పడిన ప్రతీ భార‌తీయుడు క్షేమంగా కోలుకోవాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా పనిచేసినన్నాళ్లు మీరు చూపిన ప్రేమ అద్భుతంగా కనిపించింది.ద‌య‌చేసి అందరూ జాగ్రత్తగా ఉండండి'' అంటూ పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కామెంటేటర్‌గా పనిచేసిన మైకెల్‌ స్లేటర్‌ కరోనా విజృంభణ దృశ్యా సొంత దేశానికి పయనమయ్యాడు. అయితే ఆస్ట్రేలియా భారత్‌ నుంచి వచ్చేవారిపై మే 15 వరకు నిషేధం విధించింది. దీంతో ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి ఆసీస్‌ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఐపీఎల్‌కు కరోనా సెగ తగిలి రద్దు కావడంతో లీగ్‌లో ఆడుతున్న ఆసీస్‌ క్రికెటర్లు కూడా డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోవడంతో శ్రీలంక మీదుగా మాల్దీవ్స్‌ చేరుకొని అక్కడినుంచి ఆస్ట్రేలియా చేరుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు.
చదవండి: ఐపీఎల్‌ 2021: ఆసీస్‌ క్రికెటర్లకు షాక్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు