ఇషాంత్‌ శర్మ శతకం

23 Feb, 2021 04:24 IST|Sakshi

100వ టెస్టు మ్యాచ్‌ ఆడనున్న భారత పేస్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ

సుదీర్ఘ కెరీర్‌లో పలు గొప్ప విజయాల్లో భాగస్వామి   

సుమారు 13 సంవత్సరాల క్రితం... 19 ఏళ్ల కుర్రాడొకడు పేస్‌కు స్వర్గధామంలాంటి పెర్త్‌ పిచ్‌పై ప్రపంచ టాప్‌ బ్యాట్స్‌మన్‌ రికీ పాంటింగ్‌ను గడగడలాడించాడు. ఏడు ఓవర్ల స్పెల్‌లో దాదాపు ప్రతీ బంతికి పాంటింగ్‌ తడబడ్డాడు. ఎంతో మంది దిగ్గజ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆసీస్‌ కెప్టెన్, కేవలం నాలుగో మ్యాచ్‌ ఆడుతున్న ఆ పేసర్‌ బంతులను ఎలా ఆడాలో అర్థం కాని గందరగోళంలో పడి చివరకు స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అప్పుడే క్రికెట్‌ వ్యాఖ్యాతలంతా ఈ మ్యాచ్‌ లేదా సిరీస్‌ ఫలితం ఏమైనా కానీ... ఈ అద్భుత స్పెల్‌ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని, ఆ పేసర్‌ కెరీర్‌లో ఎంతో ఎదుగుతాడని వ్యాఖ్యానించారు. నిజంగా అదే జరిగింది. ఆ స్పెల్‌ వేసిన ఇషాంత్‌ శర్మ స్థాయిని అమాంతం పెంచేసింది. ఆపై ఎన్నో ఆటుపోట్లను తట్టుకొన్న అతను భారత్‌ తరఫున అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. తనతో పోటీ పడిన ఎందరికో సాధ్యంకాని రీతిలో 100 టెస్టుల మైలురాయిని ఇంగ్లండ్‌తో బుధవారం అహ్మదాబాద్‌లో మొదలయ్యే మూడో టెస్టులో చేరుకోబోతున్నాడు.

సాక్షి క్రీడా విభాగం: ఇషాంత్‌ శర్మ 2011లో మొదటిసారి తన కెరీర్‌ లక్ష్యాల్లో 100 టెస్టులు ఆడటం ఒకటని చెప్పుకున్నాడు. అప్పటికి అతను ఇంకా 40 టెస్టులు కూడా పూర్తి చేసుకోలేదు. ఆపై వరుస గాయాలు, ఫామ్‌ కోల్పోవడం, కొత్త పేస్‌ బౌలర్ల రాక... ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినాసరే మరో దశాబ్ద కాలపు కెరీర్‌ను కొనసాగించగలగడం ఒక ఫాస్ట్‌ బౌలర్‌ కోణంలో చూస్తే సాధారణ విషయం కాదు.

తన మార్గదర్శి జహీర్‌ ఖాన్‌ 92 టెస్టులతో ఆగిపోయిన చోట... ఇషాంత్‌ మాత్రం అతడిని దాటి వంద వరకు రాగలిగాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, హై ఆర్మ్‌ యాక్షన్, అసలైన ఫాస్ట్‌ బౌలర్‌ లక్షణాలతో కెరీర్‌ ప్రారంభించిన ‘లంబూ’ భారత జట్టు సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగంగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్‌లు ఆడిన భారత ఫాస్ట్‌ బౌలర్‌గా నిలవడం అంటేనే ఇషాంత్‌ ఘనత ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది.  

ఘనారంభం...
తన రెండో టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇషాంత్‌ కెరీర్‌ జోరుగానే ప్రారంభమైంది. ‘పెర్త్‌–పాంటింగ్‌’ మెరుపు బౌలింగ్‌ తర్వాత ధోని టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే అతను మరోసారి ఐదు వికెట్లు తీసి కెప్టెన్‌ ఫేవరెట్‌గా మారాడు. ఆపై కొద్ది రోజులకే స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కూడా 15 వికెట్లతో సత్తా చాటాడు. అయితే జట్టులో రెండో ప్రధాన పేసర్‌గా జహీర్‌తో కూడా జట్టుకు కీలక విజయాలు అందిస్తున్న సమయంలో ఇషాంత్‌ బౌలింగ్‌ లయ తప్పింది. అప్పటి వరకు అతని బలమైన పేస్‌ బలహీనతగా మారిపోయింది.

దాదాపు 150కు పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయడం నుంచి 130ల్లోకి పడిపోయాడు. ఫలితంగా ప్రత్యర్థుల దృష్టిలో సాధారణ బౌలర్‌గా మారిపోవడంతో ఒకవైపు వికెట్లు రాకపోగా, మరోవైపు సాధారణ బౌలర్‌ తరహాలో టెస్టుల్లో కూడా భారీగా పరుగులు సమర్పించుకున్న పరిస్థితి. ముఖ్యంగా 2012 ఆస్ట్రేలియా పర్యటన అతని కెరీర్‌లో చేదు జ్ఞాపకంగా మిగిపోయింది. నాలుగు టెస్టుల్లో కలిపి ఐదంటే ఐదే వికెట్లు తీసి గత సిరీస్‌లో హీరోగా మారిన చోట జీరోలా కనిపించాడు. ఏదోలా 50 టెస్టులు పూర్తి చేసుకున్నా... కనీసం 50 టెస్టులు ఆడిన బౌలర్లలో అందరికంటే చెత్త బౌలింగ్‌ సగటు ఇషాంత్‌దే కనిపించింది.  

మళ్లీ సత్తా చాటి...
కెరీర్‌ ప్రమాదంలో పడిన దశలో ఇషాంత్‌ దానిని చక్కదిద్దుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. ముఖ్యంగా తనను ఇబ్బంది పెడుతున్న ఫిట్‌నెస్‌ సమస్యపై దృష్టి పెట్టాడు. పైగా పరిమిత ఓవర్లకు దాదాపుగా గుడ్‌బై చెప్పి  పూర్తిగా ఎరుపు బంతిపైనే దృష్టి పెట్టాడు. దాంతో సహజంగానే ఫలితాలు వచ్చాయి. 2014 న్యూజిలాండ్‌ పర్యటన అతడికి మేలిమలుపు. రెండు టెస్టుల్లోనే 15 వికెట్లు తీసిన ఇషాంత్‌ బౌలింగ్‌లో పదును పెరిగిందని అందరికీ అర్థమైంది.

ఆ తర్వాత కొద్ది రోజులకే లార్డ్స్‌ మైదానంలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌పై 74 పరుగులకే 7 వికెట్లు పడగొట్టిన ప్రదర్శన అతని కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. అతని బౌలింగ్‌ వల్లే ఈ సిరీస్‌లో భారత్‌ తన ఏకైక టెస్టును గెలవగలిగింది. ఆ తర్వాత ఇషాంత్‌ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కీలక సమయాల్లో కొంత అదృష్టం కూడా అతనికి కలిసొచ్చింది. ఇప్పుడున్న తరహాలో టీమిండియా పేస్‌ బౌలింగ్‌ దళంలో ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో కొన్నిసార్లు వైఫల్యాలు వచ్చినా... సీనియర్‌ హోదాలో ఇషాంత్‌ అనేక టెస్టులు ఆడగలిగాడు.  

మరింత మెరుగవుతూ...
గత కొన్నేళ్లలో ఇషాంత్‌ కెరీర్‌ గణాంకాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. ససెక్స్‌ తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడినప్పుడు ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ జేసన్‌ గిలెస్పీ ఇచ్చిన సూచనలు ఇషాంత్‌ ఆటను రాటుదేల్చాయి. 2018 నుంచి చూస్తే కమిన్స్, అండర్సన్‌లకంటే మెరుగ్గా  ఇషాంత్‌ సగటు అద్భుత రీతిలో 19.34 మాత్రమే ఉందంటే అతను ఎంతగా చెలరేగిపోతున్నాడో అర్థమవుతుంది. సుదీర్ఘ కెరీర్‌లో పలు ప్రతికూలతలు అధిగమించి కృషి, పట్టుదల, సంకల్పంతో అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన ఇషాంత్‌ శర్మ వంద టెస్టులు ఆడటం పేసర్లకు స్ఫూర్తినిచ్చే, గర్వపడే క్షణం అనడంలో సందేహం లేదు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు