ధావన్‌ సెంచరీ.. అక్షర్‌ ఫినిషింగ్‌

17 Oct, 2020 23:23 IST|Sakshi

షార్జా:  చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించి ఆ జట్టుకు ఘనమైన విజయాన్ని అందించాడు. ఢిల్లీలోని మిగతా టాపార్డర్‌ ఆటగాళ్లు తడబడ్డ చోట ధావన్‌ మెరిశాడు. తాను ఎప్పుడూ క్లాస్‌ ఆటగాడననే చెప్పుకునే ధావన్‌.. ఒక మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 101 పరుగులు సాధించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.  ఇది ధావన్‌కు ఐపీఎల్‌లో తొలి సెంచరీ.

సీఎస్‌కే నిర్దేశించిన 180 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. దీపక్‌ చహర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే పృథ్వీ షా డకౌట్‌ అయ్యాడు. ఆపై అజింక్యా రహానే(8) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(23; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), స్టోయినిస్‌(24;14 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మోస్తరుగా ఆడగా, ధావన్‌ మాత్రం జట్టు విజయం సాధించే వరకూ క్రీజ్‌లో ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ధావన్‌ ఆటలో సిక్స్‌లు పెద్దగా లేకపోయినా బౌండరీలను గ్యాప్‌ల్లోంచి రాబట్టడం ద్వారా తనేమిటో నిరూపించుకున్నాడు. (డీకాక్‌ డగౌట్‌ వైపు పరుగు.. రోహిత్‌ నవ్వులు!)

కాగా, ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సమయంలో ఆ బాధ్యతను అక్షర్‌ తీసుకున్నాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి ధావన్‌ సింగిల్‌ తీయగా,  అక్షర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు.  ఇక నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన అక్షర్‌.. ఐదో బంతికి మరో సిక్స్‌ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. ధావన్‌ సెంచరీకి అక్షర్‌ మంచి ఫినిషింగ్‌ ఇవ్వడంతో ఢిల్లీ ఇంకా బంతి ఉండగా విజయం సాధించింది. అక్షర్‌ 5 బంతుల్లో అజేయంగా 21 పరుగులు సాధించడంతో అప‍్పటివరకూ సీఎస్‌కే వైపు ఉన్న మ్యాచ్‌  కాస్తా ఢిల్లీ వైపు మొగ్గింది. ఇది ఢిల్లీకి ఏడో విజయం కాగా, సీఎస్‌కేకు ఆరో ఓటమి.

ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ 180 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంబటి రాయుడు(45 నాటౌట్‌; 1ఫోర్‌, 4 సిక్స్‌లు)  రవీంద్ర జడేజా(33 నాటౌట్‌; 13 బంతుల్లో 4 సిక్స్‌లు), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో  సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే ఆదిలోనే సామ్‌ కరాన్‌ వికెట్‌ను కోల్పోయింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే కరాన్‌ డకౌట్‌ అయ్యాడు. ఆ సమయంలో డుప్లెసిస్‌కు షేన్‌ వాట్సన్‌ జత కలిశాడు. ఈ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.  

వాట్సన్‌ 28 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేసిన తర్వాత వాట్సన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. నోర్జే బౌలింగ్‌లో వాట్సన్‌ ఔటయ్యాడు. ఆపై డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా,  మూడో వికెట్‌గా డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. రబడా బౌలింగ్‌లో ధావన్‌ క్యాచ్‌ పట్టడంతో డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌  ముగిసింది. ఇక కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(3) విఫలమయ్యాడు. నోర్జే వేసిన 17 ఓవర్‌ మూడో బంతికి కీపర్‌ అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ పట్టగా ధోని నిష్క్రమించాడు.  కాగా, అంబటి రాయుడు మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడటంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో  నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా, రబడా, దేశ్‌పాండేలకు తలో వికెట్‌ దక్కింది.(డివిలియర్స్‌ విధ్వంసం; ఆర్‌సీబీ మరో విజయం)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు