పార్లమెంట్‌లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు

28 Nov, 2021 05:45 IST|Sakshi

29న ప్రతిపక్షాల భేటీకి హాజరుకాబోము

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టీకరణ

కోల్‌కతా: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీతో సమన్వయం చేసుకోవడంపై తమకు ఆసక్తి లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇతర పక్షాలకు సహకారం అందిస్తామని వెల్లడించింది. కాంగ్రెస్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 29న నిర్వహించనున్న ప్రతిపక్షాల భేటీకి తాము హాజరుకాబోమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని టీఎంసీ సీనియర్‌ నాయకుడొకరు శనివారం చెప్పారు.

కాంగ్రెస్‌ ముందు అంతర్గతంగా సమన్వయం చేసుకోవాలని, సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ తర్వాతే ఇతర పార్టీలతో సమన్వయంపై ఆలోచించాలని సూచించారు. అధికార బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్‌ నేతల్లో అంకితభావం కనిపించడం లేదని తప్పుపట్టారు. కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతింటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అసమర్థ పార్టీ అని తృణమూల్‌ ఆరోపిస్తోంది. బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శిస్తోంది.

మరిన్ని వార్తలు