కులచిచ్చుల సూత్రధారి చంద్రబాబే 

10 Oct, 2020 04:45 IST|Sakshi
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మేరుగ నాగార్జున

అంబేడ్కర్‌ ఆలోచనలతో జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన 

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున 

తిరుపతి అర్బన్‌: తెలుగు రాష్ట్రాల్లో ఆది నుంచి కుల చిచ్చులకు సూత్రధారి, పాత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. తిరుపతి నగరంలోని హోటల్‌ భీమాస్‌ రెసిడెన్సీ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఐక్య దళిత మహానాడు, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్, దళిత విద్యార్థి సమాఖ్య, అంబేడ్కర్‌ ప్రజాసేన సంయుక్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించాయి. తెలుగు రాష్ట్రాల్లోని 56 దళిత, గిరిజన సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. గతంలో రిజర్వేషన్ల పేరుతో దళితులను విడగొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు కుట్ర చేశారన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజాప్రతినిధులను, కులసంఘాల నేతలనే కాకుండా న్యాయవాదులను, న్యాయమూర్తులను సైతం ఈ ఉచ్చులోకి దింపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కాగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని నాగార్జున పేర్కొన్నారు. కల్లూరి చెంగయ్య, మల్లారపు మధు, రత్నా, పీసీ స్వామి, శ్యామలాదేవి, పీవీఎస్‌ మణి, దామినేటి కేశవులు, శివశంకర్‌నాయక్‌ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా