రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?

17 Oct, 2020 14:39 IST|Sakshi

టాలీవుడ్‌లో సెకండ్‌‌ ఇన్నింగ్స్ షూరు

సాక్షి, హైదరాబాద్‌ : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల కోటాలో రెండుస్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఎన్నికకు ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసిపోగా.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు మరింత దూకుడు పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దుబ్బాకలో దుమ్మురేపుతున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీఆర్‌ఎస్‌ ఎత్తులు వేస్తుండగా.. మొదటిసారి గెలుపొందాలని బీజేపీ, పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ పార్టీ వ్యహరచన చేస్తున్నాయి. దీంతో దుబ్బాక పోరు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు బరిలోకి దింపి నియోజవర్గాన్ని చుట్టుముట్టాయి. టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి హరీష్‌రావు అన్నీ తానై చూసుకుంటుండగా.. బీజేపీ అభ్యర్థి రాఘునందన్‌రావుతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇతర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. (ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు చావోరేవో!)

దుబ్బాకకు దూరంగా రాములమ్మ..
మరోవైపు గత వైభవం కోసం పోరాడుతన్న కాంగ్రెస్‌ పార్టీ సైతం తానేం తక్కువకాదన్నట్టూ రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం దుబ్బాకలో దింపింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే స్థానికంగా కీలకనేతైన ఫైర్‌ బ్రాండ్‌ విజయశాంతి కంటికి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్య నేతగా ఉన్న రాములమ్మ కీలకమైన పోరులో పార్టీకి దూరంగా ఉండటం వెనుక కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్‌నటిగా ఖ్యాతిగఢించిన విజయశాంతి.. 2000లో తన రాజకీయ అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించి.. టీఆర్‌ఎస్‌ నుంచి 2009లో మెదక్‌ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉద్యమ నేపథ్యం, స్టార్‌నటి కావడంతో విజయశాంతి చేరిక తమకు కలిసొస్తుందని హస్తం నేతలు భావించారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు.

టీడీపీతో పొత్తుకు వ్యతిరేకం..
ఈ క్రమంలోనే 2014లో మెదక్‌ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఘోర పరాజయం మూటగట్టకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగానే వ్యతిరేక స్వరం వినిపించారు.‌ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఏఐసీసీ కార్యదర్శి పదవి కావాలని అడిగిన తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని నేతల ముందు పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకాల మరణం, ఉప ఎన్నికల సంభవించడం అన్నీ చకచక జరిగిపోయాయి.

తీవ్ర మనస్థాపం..
అయితే ఉప ఎన్నికల బరిలో సొంత జిల్లా నేతైన విజయశాంతి బరిలో నిలపాలని రాష్ట్ర పార్టీ తొలుత నిర్ణయించింది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు, బరిలో నిలవడం ఖాయమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. అయితే దీనికి స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవ్వడంతో రాములమ్మ వెనక్కి తగ్గకతప్పలేదు. రెండు వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన నేతను ఉప ఎన్నికల్లో నిలిపితే అధికార టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో విజయం సాధింస్తుందనే అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద స్థానిక నేతలంతా బలంగా వినిపించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయశాంతి పోటీ నుంచి తప్పుకుని కనీసం దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ప్రచారానికి సైతం దూరంగా ఉంటున్నారు.

టాలీవుడ్‌లో సెకండ్‌‌ ఇన్నింగ్స్
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పట్లో ఎన్నికల లేనందున విజయశాంతి ఇక పూర్తిగా రాజకీయలకు దూరంగా ఉంటారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని సమాచారం. టాలీవుడ్‌ సూపర్‌‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ మూవీ అనంతరం ఆమెకు టాలీవుడ్‌లో వరస అవకాశాలు వస్తున్నాయి. దీంతో తన సెకండ్‌‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రాములమ్మ సిద్ధమయ్యారని, ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని తెలంగాణ రాజకీయ వర్గల్లో చర్చసాగుతోంది. ఈ వార్తలకు విజయశాంతి ఏ విధంగా చెక్‌పెడతారనేది వేచి చూడాలి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు