కరోనా వ్యాప్తి: నైట్‌ కర్ఫ్యూ, సెక్షన్‌ 144!

21 Nov, 2020 16:14 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

పెరుగుతున్న కేసులు.. వివిధ రాష్ట్రాల్లో కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. యూరప్‌ దేశాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలవడంతో ఫ్రాన్స్‌ వంటి దేశాలు మరోసారి లాక్‌డౌన్‌ విధించాయి. రెండో దశలో వైరస్‌ మరింత తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక భారత్‌లోనూ ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 90 లక్షల యాభై వేలు దాటింది. అయితే రికవరీ రేటు 93 శాతానికి పైగా ఉండటం ఊరట కలిగించే అంశమే అయినా మరోసారి కరోనా పంజా విసిరితే కట్టడి చేయడం కష్టమని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, భోపాల్‌ తదితర ప్రధాన పట్టణాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు..

ఢిల్లీ
ఢిల్లీలో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైన తరుణంలో కేజ్రీవాల్‌ సర్కారు కోవిడ్‌-19 నిబంధనలను కఠినతరం చేసింది. మాస్కు ధరించకపోతే 2 వేల రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా పెళ్లి తదితర శుభాకార్యాలకు 50 మంది అతిథులకు మాత్రమే అనుమతించింది. మార్కెట్లు తెరిచేందుకు పర్మిషన్‌ ఇచ్చినా, పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన తమకు లేదని, అయితే అదే సమయంలో రూల్స్‌ అతిక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.(చదవండి: భారత్‌లో కరోనా యాక్టివ్‌ కేసులు 4.86 శాతం)

ముంబై
దేశ ఆర్థిక రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబరు 31 వరకు పాఠశాలు మూసివేయాలని బృహణ్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా లోకల్‌ రైళ్ల ప్రయాణాలు ఇప్పుడప్పుడే మొదలుకావని ముంబై మేయర్‌ స్పష్టం చేశారు. కాగా ముంబై మినహా మిగతా ప్రాంతాల్లో నవంబరు 23 నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని ఠాక్రే సర్కారు ఆదేశించింది.

గుజరాత్‌
గుజరాత్‌ ముఖ్యపట్టణం అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించారు. కేవలం నిత్యావసరాల(పాలు, మెడికల్‌ షాపులు) షాపులు మాత్రమే తెరిచేందుకు అనుమతినిచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. నవంబరు 23 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవచ్చన్న ఆదేశాలు వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో, పట్టణంలో వాటిని అమలు చేయలేమని పేర్కొన్నారు. రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదరలోనూ నైట్‌ కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు.(చదవండి: ఊరంతా కరోనా.. అతడికి తప్ప)

మధ్యప్రదేశ్‌
ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియర్‌, రట్లాం, విదిశలో నవంబరు 21 నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. అయితే కంటెన్మైంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాకౌడౌన్‌ విధించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాల వరకు స్కూళ్లు మూసివేసే ఉంచాలని, క్లాస్‌9-12 విద్యార్థులు మాత్రం కాస్లులకు హాజరుకావొచ్చని వెల్లడించారు. ఇక సినిమా హాళ్లు 50 శాతం సీట్ల సామర్థ్యంలో యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపారు.

రాజస్తాన్‌
నవంబరు 21 నుంచి అన్ని జిల్లాల్లో సెక్షన్‌ 144 విధిస్తూ రాజస్తాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేలా జిల్లా మెజిస్ట్రేట్‌(కలెక్టర్ల)లకు అధికారాలు కట్టబెట్టినట్లు సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు