ఆస్కార్‌ అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో విద్యాబాలన్‌, ఏక్తా కపూర్‌

2 Jul, 2021 17:30 IST|Sakshi

ప్రపంచ సినీ రంగంలో అకాడమీ అవార్డులకు ఉన్న విలువ మరే అవార్డులకు ఉండదు. ఆస్కార్ వచ్చిందంటే అది ఏ క్యాటగిరి అయినా అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. అభ్యర్థులను ఎంపిక చేయాలంటే ఆయా క్యాటగిరిల్లో వారిని వడబోసి ఆస్కార్ అవార్డులను ఇస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ అస్కార్ అవార్డుల ఎంపికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల జాబితాను ఆస్కార్ వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె తల్లి శోభా కపూర్‌లు ఉండటం విశేషం. మొత్తం 50 దేశాలకు చెందిన 395 మంది సభ్యులు ఈ ఏడాది ఆస్కార్‌ సభ్యులుగా ఉన్నారు. ‘ద క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో ఆస్కార్‌ ఆకాడమీ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఆస్కార్‌ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం.

కాగా ‘మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌హానీ’ చిత్రంలో విద్యాబాలన్‌ గర్భవతిగా తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ‘పా, బూల్‌బుల‌య్యా, ప‌రిణీత‌, బాబీ జాసూస్‌, శ‌కుంత‌లా దేవి’ చిత్రాల్లోనూ ఆమె న‌టించారు. 2011లో వ‌చ్చిన ‘ద డ‌ర్టీ పిక్చ‌ర్’ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన విద్యాబాల‌న్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. అలాగే బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూస‌ర్లు ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్‌లు కూడా ఆస్కార్ అకాడ‌మీలో కొత్త స‌భ్యుల‌య్యారు. డ్రీమ్ గ‌ర్ల్‌, వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్‌, డ‌ర్టీ పిక్చ‌ర్ లాంటి సినిమాల‌కు వీళ్లు నిర్మాత‌లుగా వ్యవహరించారు. 

మరిన్ని వార్తలు