అందుకే నీకు అవకాశాలు వస్తున్నాయి.. నటిపై విద్వేషపు విషం!

2 Jul, 2021 18:22 IST|Sakshi

కోల్‌కతా: ‘‘ఆ దర్శకుడితో డేటింగ్‌లో ఉన్నందుకే నీకు ఆఫర్లు వస్తున్నాయి. లేదంటే నువ్వు ‘కమిట్‌మెంట్‌’ ఇస్తేనే తప్ప నిన్ను ఎవరు సీరియల్‌లో పెట్టుకుంటారు. నీలాంటి మేని ఛాయ ఉన్నవాళ్లకు అవకాశాలు రావాలంటే అలాంటి పాడు పనులు తప్పవులే’’... బెంగాలీ నటి శృతిదాస్‌పై కొంతమంది నెటిజన్ల విద్వేషపు కామెంట్లు ఇవి. ప్రస్తుతం ఆమె.. ‘దశేర్‌ మాతీ’ అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో శృతితో పాటు పాయల్‌ దే, రుక్మా రే అనే మరో ఇద్దరు నటీమణులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మేని ఛాయతో శృతి స్కిన్‌ కలర్‌ను పోలుస్తూ ఈ విధంగా ట్రోల్స్‌ రెచ్చిపోతున్నారు. గత రెండేళ్లుగా ఆమెపై విద్వేష విషం కక్కుతూనే ఉన్నారు. దీంతో విసిగిపోయిన శృతి... ఆన్‌లైన్‌లో తనకు వస్తున్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ‘‘బ్లాక్‌ బోర్డు, నలుపు అమ్మాయి.. ఇలాంటి పేర్లతో నన్ను వేధించడం కొంతమందికి పనిగా మారింది. అసలు నీలాంటి వారిని హీరోయిన్లుగా ఎలా పెట్టుకుంటారంటూ కించపరుస్తున్నారు. అంతేకాదు లీడ్‌రోల్స్‌ కోసం నేను దర్శకులతో ‘రాజీ’ కుదుర్చుకుంటున్నానని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మరికొంత మందేమో... స్వర్నేందు(బెంగాలీ సీరియల్‌ డైరెక్టర్‌)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నందు వల్లే ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. కానీ అవన్నీ నిజం కావు. 

నా ప్రతిభే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎవరో రికమెండ్‌ చేస్తేనో, లేదంటే ‘మరో’ విధంగానో నేను అవకాశాలు దక్కించుకోవడం లేదు. ప్రేక్షకులు ఆదరించకపోతే.. ఎవరూ ఏం చేయలేరు. నా కారణంగా నష్టపోవడానికి సిద్ధపడరు. గత రెండేళ్లుగా నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే నిన్ననే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా త్రినయని సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి దాస్‌.. ప్రస్తుతం దశర్‌ మాతీ సీరియల్‌లో.. టీచర్‌గా నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు