కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ...

13 Jun, 2021 08:48 IST|Sakshi

మొహబ్బతే

 త్యాగం.. ప్రేను ఓడిస్తుంది..
 స్వార్థం.. మనిషిని గెలిపిస్తుంది.. 
చిత్రంగా రెండూ ప్రేమకు విషాదాంతాలిచ్చేవే! 
స్వార్థం, త్యాగం పోరులో కంగనా రనౌత్, అధ్యయన్‌ సుమన్‌ ప్రేమ కూడా ఓడిపోయింది. 

చాలా మంది సినిమా వాళ్ల ప్రేమ కథల్లాగే వీళ్ల కథకూ స్టార్టింగ్‌ పాయింట్‌ షూటింగ్‌ స్పాటే. కంగనా, అధ్యయన్‌ కలిసి నటించిన ‘రాజ్‌.. ది మిస్టరీ కంటిన్యూస్‌’ సెట్స్‌. ఆ సినిమాలోని ‘ఓ జానా.. ’ పాట చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. షూటింగ్‌ అయిపోయాక లాంగ్‌ డ్రైవ్స్, డిన్నర్‌లు సాధరణమయ్యాయి వాళ్ల షెడ్యూల్‌లో. సినిమా పూర్తయ్యేలోపే అధ్యయన్‌కు ‘ఐ లవ్‌ యూ’  చెప్పింది కంగనా. ‘మై భీ’ అన్నాడు. అది ఎన్నాళ్లుంది? ఎందుకు ఎండ్‌ అయింది? అధ్యయన్‌ మాటల్లోనే  తెలుసుకుందాం (‘డీఎన్‌ఏ’కు అతను ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి)...

నాకొక రోజు మహేశ్‌ భట్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘రాజ్‌ 2 రషెస్‌ చూసి ఫోన్‌ చేస్తున్నా.. నీ వర్క్‌ చాలా నచ్చింది. నీతో సినిమా చేయాలనుకుంటున్నా’ అంటూ. నా ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌లోనే ఉండడంతో కంగనా కూడా విన్నది.  నిజానికి నా కెరీర్‌ను మలిచే గుడ్‌ న్యూస్‌ అది. కానీ ఆమెకు నచ్చలేదు. ‘నాకెందుకు ఎవ్వరు ఫోన్‌ చేయరు? ఏం చూసి నీకు చాన్స్‌ ఇస్తామంటున్నారు?’ అని చిటపటలాడింది. ఆ రియాక్షన్‌కు ఫీలయ్యా. ఫ్యాషన్‌ మూవీ తర్వాత కొన్నాళ్ల దాకా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే అలా అంటుందని సరిపెట్టుకున్నా. నా బర్త్‌డేకు ఒకసారి మా నాన్న (శేఖర్‌ సుమన్‌) బీఎమ్‌డబ్ల్యూ సెవెన్‌ సిరీస్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ గుడ్‌న్యూస్‌ను కంగనాతో షేర్‌ చేసుకుంటే బదులుగా వెటకారమే. ‘ఏం సాధించావని కోటి రూపాయల గిఫ్ట్‌ కొనిచ్చాడు మీ నాన్న?’ అంటూ. ఆ సంఘటన తర్వాత కంగనా హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడి నుంచి కాల్‌ చేసింది ‘నేను తెలుగు మూవీ ఒకటి సైన్‌ చేశా. ప్రభాస్‌ హీరో. ఇంకో సంగతి బీఎమ్‌డబ్ల్యూ సెవెన్‌ సిరీస్‌ బుక్‌ చేశా’ అని చెప్పింది. అంత పోటీ తనకు.

లూజర్‌ అనే మాట వినీవినీ..
కంగనా తీరేంటో అర్థమయ్యేది కాదు. ఆమెకెప్పుడు ప్రేమ పుడుతుందో.. ఎప్పుడు కోపం వస్తుందో..  దేనికి సంతోషంగా ఉంటుందో.. దేనికి హర్ట్‌ అవుతుందో తెలిసేది కాదు. ఆ రిలేషనే కన్‌ఫ్యూజన్‌. ఇంకా చెప్పాలంటే  ప్రేమ కన్నా అవమానాన్నే ఇచ్చింది. అన్నిటినీ భరించాను. నోటికొచ్చినట్టు తిట్టినా.. నా మీద చేయి చేసుకున్నా తట్టుకున్నాను. ఆఖరికు నా కళ్లముందే మా నాన్నను ఇన్‌సల్ట్‌ చేసినా తన వైపే ఉన్నా. ఫిలిం జర్నలిస్ట్‌లతో నాకు ఫోన్లు చేయించి ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాననే స్టేట్‌మెంట్స్‌ ఇప్పించింది. బేషరతుగా ఇచ్చాను. నా కెరీర్‌ కన్నా తనే ముఖ్యమనుకొని. కానీ అదే స్టేట్‌మెంట్‌ తనను ఇవ్వమంటే ఇవ్వకుండా దాటవేసింది. అయినా నేను  ప్రశ్నించలేదు. ఆమె ఎక్సెంట్రిక్‌ బిహేవియర్‌ను ఆడవాళ్ల భావోద్వేగాల కోణంలోంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. కానీ దాన్ని ఆమె అడ్వాంటేజ్‌గా తీసుకుంది.

దాంతో కంగనాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పసిగట్టింది తను. వెంటనే నన్ను సునీత మీనన్‌ అనే జ్యోతిష్యురాలి దగ్గరకు పట్టుకెళ్లింది. మేమిద్దరం మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని, మా ఇద్దరి బంధం ఇద్దరికీ కలిసి వస్తుందని చెప్పించింది. ఆ మాటలు నమ్మి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. షరా మామూలే. పొంతన కుదరని ఆమె ప్రవర్తనతో నాకు కన్‌ఫ్యూజనూ మామూలే. ఈసారి నావల్ల కాలేదు. నాతో డేటింగ్‌ చేస్తూనే హృతిక్‌ రోషన్‌ మీద మనసు పెట్టుకుంది. ఆమె అతనికి రాసిన మెయిల్స్‌ నా కంటబడ్డాయి. ఆమె ఆసక్తులు, లక్ష్యాలు వేరని, మాది నిలబడే రిలేషన్‌ కాదనీ స్పష్టమైంది. ఆ ఇంట్లోంచి వచ్చేశా. దాన్నీ తనకు అనుకూలంగానే మలచుకుంది కంగనా. చెప్పాపెట్టకుండా  ఆమెను వదిలేసి వెళ్లిపోయానని ప్రచారం చేసి సింపతీ పొందింది.

సినిమా చాన్స్‌ల కోసం నేను తనను వాడుకున్నాననీ కామెంట్‌ చేసింది. బ్రేకప్‌తో ఆల్రెడీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన నాకు ఆమె మాటలతో మరింత నిస్పృహ ఆవహించింది. తిప్పికొట్టే ఓపిక, సమర్థించుకునే శక్తీ అడుగంటిపోయాయి. ‘లూజర్‌’ అనే మాట వినీవినీ నా మీద నేనే నమ్మకం కోల్పోయా. తర్వాత ఆలోచిస్తే అనిపించింది.. ఎవరు ఎవరిని వాడుకున్నారు అని. తను నాకు పరిచయం అయ్యేనాటికి ఆమె స్టారేం కాదు. కానీ నాకు స్టార్‌డమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ అయినా ఉంది కదా ( తండ్రి శేఖర్‌ సుమన్‌ పేరున్న నటుడు) వాడుకోవాలనుకుంటే’ అంటాడు అధ్యయన్‌ సుమన్‌. 

లవ్‌ ఫెయిల్యూర్‌తో మందుకు, సిగరెట్‌కు బానిసయ్యాడు అధ్యయన్‌. తల్లిదండ్రుల సహాయంతో బయటపడ్డాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ అధ్యాయం తర్వాత కంగనా ప్రయాణమూ ఆగలేదు. ‘జీవితంలో ప్రేమతో నాకు చేదు అనుభవాలే ఉన్నప్పటికీ ప్రేమలో పడని రోజులు నాకు గుర్తులేవు. ప్రేమిస్తూనే ఉంటాను.. దెబ్బతింటూనే ఉంటాను.. నిలబడ్తాను .. మళ్లీ ప్రేమలో పడ్తాను. ప్రేమ జీవితేచ్ఛను కలిగిస్తుంది ’ అంటుంది కంగనా రనౌత్‌. 
-ఎస్సార్‌

మరిన్ని వార్తలు