Bigg Boss Telugu 5 Elimination: నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావ్‌ షణ్నూ: రవి

29 Nov, 2021 00:49 IST|Sakshi

అమ్మకు, దీప్తి సునయనకు సమానంగా ప్రైజ్‌మనీ పంచుతా: షణ్ముఖ్‌

శ్రీహాన్‌ పేరెంట్స్‌కున్న రూ.10 లక్షల అప్పు తీర్చుతా: సిరి

Bigg Boss Telugu 5, Ravi Eliminated From BB Show: ఇప్పటివరకు బిగ్‌బాస్‌ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్‌లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని మన్మథుడు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్‌ విన్నర్‌ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్‌.

మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్‌ మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక' అని చెప్పాడు. 'కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థ నెలకొల్పాన్న కోరికను నెరవేర్చుకుంటా' అని చెప్పాడు రవి.

కాజల్‌ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్‌ పెడతానన్నాడు. మానస్‌ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేస్తానని చెప్పాడు. షణ్ముఖ్‌.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్‌ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు. సిరి శ్రీహాన్‌ పేరెంట్స్‌కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది.

తర్వాత షణ్ముఖ్‌, ప్రియాంక సేఫ్‌ అవగా ​రవి, కాజల్‌ మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్‌ చేస్తావా? అని నాగ్‌ సన్నీని అడిగాడు. ఆ పాస్‌ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్‌ చేసిన కాజల్‌కు వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్‌ అయ్యాడని నాగ్‌ ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్‌ అయ్యేవాడు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న రవి ఎలిమినేట్‌ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్‌ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు.

సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. అందరూ కన్నీటితో భారంగా ఆయనకు వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్‌ జర్నీలో ఎవరు పాస్‌, ఎవరు ఫెయిల్‌? అనే గేమ్‌ ఆడాడు. షణ్ను పాస్‌ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు.

లేట్‌గా కనెక్ట్‌ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్‌ చేశాడు. ఫ్రెండ్‌ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్‌ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. టాప్‌ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్‌ చేశాడు. మానస్‌ను చూసి చాలా ఇన్‌స్పైర్‌ అయ్యానంటూనే అతడికి ఫెయిల్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి.. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ ఆఖరి మాటగా చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు