వెండితెరపై... విజువల్‌ పొయట్‌

13 Jun, 2021 09:10 IST|Sakshi

బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (1944 – 2021)

పదచిత్రాలతో దృశ్యాన్ని బొమ్మకట్టించే ఓ కవి... వెండితెరపై దృశ్యాలను కవిత్వీకరిస్తే ఏమవుతుంది? కవికి ఉండే సహజమైన సున్నితత్వంతో సమాజాన్నీ, మనుషుల్నీ తెరపై చూపెడితే ఆ కళాసృజనలు ఎలా ఉంటాయి? తెలియాలంటే... భారతీయ సినిమా జెండాను అంతర్జాతీయంగా ఎగరేసిన ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా సినిమాలు చూడాలి. జూన్‌ 10న తన 77వ ఏట బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా కన్నుమూశారనగానే, ఒక్క బెంగాలీలే కాదు... భారతీయ సినీ ప్రియులందరూ విషాదంలో మునిగింది అందుకే! వెండితెరపై ఆయనది విజువల్‌ పొయిట్రీ. దర్శకుడి కన్నా ముందు పేరున్న కవి అయిన బుద్ధదేవ్‌ ఏకంగా తొమ్మిది కవితా సంపుటాలు, 4 నవలలు రాయడం విశేషం. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దర్శకుడిగా ఆయన తీసినవి అతికొద్ది ఫీచర్‌ ఫిల్మ్‌లే. అన్నీ ఆణిముత్యాలే. అవార్డు విన్నర్లే! 

దిగ్దర్శక త్రయం సత్యజిత్‌ రే, మృణాల్‌ సేన్, ఋత్విక్‌ ఘటక్‌ తరువాత బెంగాలీ చలనచిత్ర చయనికను, ఆ మాటకొస్తే భారతీయ సినిమాను అంతర్జాతీయంగా దీప్తిమంతం చేసిన దర్శకతార బుద్ధదేవ్‌. అయితే, ఆయన మాత్రం ఆ దర్శక త్రిమూర్తులతో తనను పోల్చవద్దనేవారు. సమకాలికులైన జి. అరవిందన్, అదూర్‌ గోపాలకృష్ణన్, శ్యామ్‌ బెనెగల్‌ల తరానికి చెందినవాడినని వినయంగా చెప్పుకొనేవారు. చిన్నతనంలో రవీంద్రనాథ్‌ టాగూర్‌ ప్రభావంతో కవిగా కలం పట్టిన బుద్ధదేవ్‌కు కోల్‌కతా అంటే ప్రాణం.

బెంగాల్‌లోని పురూలియా ప్రాంతంలో 1944లో జన్మించిన బుద్ధదేవ్‌ కోల్‌కతాలోనే చదువుకున్నారు. ఆ నగరాన్ని ఆయన తెరపై చూపించిన తీరు గురించి ఇవాళ్టికీ సినీజనం చెప్పుకుంటారంటే, దాని వెనుక ఉన్న ఆయన ప్రేమే అందుకు కారణం. కోల్‌కతాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆయన మొదలైంది ఎకనామిక్స్‌ లెక్చరర్‌గా! కానీ, చెబుతున్న ఆర్థిక సిద్ధాంతానికీ, చూస్తున్న సామాజిక–రాజకీయ వాస్తవికతకూ మధ్య ఉన్న తేడాతో ఆయన మబ్బులు విడిపోయాయి. లెక్కల కన్నా కళల మీద మక్కువే జయించింది. అలా బెంగాల్‌లోని సాంస్కృతిక, కళా జీవితంతో పాటు నక్సల్బరీ ఉద్యమం ఆయనను ప్రభావితం చేసింది. 

బుద్ధదేవ్‌ సెల్యులాయిడ్‌ బాంధవ్యం 1960ల చివరలో డాక్యుమెంటరీలతో మొదలైంది. ఆ తరువాత పదేళ్ళకు ఫీచర్‌ ఫిల్మ్‌ల స్థాయికి ఎదిగింది. దేశంలో 21 నెలల అంతర్గత ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత బెంగాల్‌లో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం వచ్చింది. రాజకీయ కార్యకర్తల్ని బేషరతుగా వదిలేయమంటున్న రోజులు. అంతటా రాజకీయ, సాంస్కృతిక సమరోత్సాహం నెలకొన్న సమయం. సరిగ్గా అప్పుడు ముప్పయ్యో పడిలోని బుద్ధదేవ్‌ తన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘దూరత్వ’ (1978)తో జనం ముందుకు వచ్చారు.

సాక్షాత్తూ సత్యజిత్‌ రే కవితాత్మకంగా ఉందంటూ ఆ చిత్రాన్ని ప్రశంసించారు. ఆ తొలి చిత్రంతోనే నేషనల్‌ అవార్డు సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించిన బుద్ధదేవ్‌ ఆ వెంటనే ‘నీమ్‌ అన్నపూర్ణ’తో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. కార్లోవీ వారీ, లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఆ చిత్రానికి అవార్డులు రావడం అందుకు దోహదమైంది. ఆయన ఇక వెనుతిరిగి చూసింది లేదు. 

బుద్ధదేవ్‌ సినీ ప్రయాణమంతా సామాన్యులపట్ల అక్కర, కవితా దృష్టి – సంగమమే. అందుకే, ఆయన ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసూ గెలిచారు. వెండితెరను కవితాత్మకంగా తీర్చిదిద్దిన బుద్ధదేవ్‌ దర్శకత్వంలో ‘బాగ్‌ బహదూర్‌’, ‘చరాచర్‌’, ‘లాల్‌ దర్జా’, ‘కాల్‌పురుష్‌’, ‘మోండో మేయేర్‌ ఉపాఖ్యాన్‌’, మిథున్‌ చక్రవర్తి నటించిన ‘తహదేర్‌ కథ’ (1992) ఎంతో  పేరొం దాయి.

రియలిజమ్‌ను దాటి, మ్యాజికల్‌ రియలిజమ్, సర్రియలిజమ్‌ వైపు ప్రేక్షకులను ఆయన తన సినిమాతో తీసుకువెళ్ళారు. మ్యాజికల్‌ రియలిజమ్‌నూ, కవితాత్మనూ కలగలిపి, తెరపై చూపారు. నిజానికి, ‘సినిమాలో కథ కన్నా కీలకమైనది మనం కళ్ళకు కట్టించే బొమ్మ’ అని ఆయన అభిప్రాయపడేవారు. చివరి దాకా ఆ పద్ధతే అనుసరించారు.

ఫీచర్‌ ఫిల్మ్స్‌ చేస్తూనే వాటి రూపకల్పనకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడం కోసం అవార్డ్‌ విన్నింగ్‌ డాక్యుమెంటరీలు తీయడమూ కొనసాగించారు. సంగీతం సినిమాల్లో అంతర్భాగమని నమ్మిన బుద్ధదేవ్‌ భారతీయ, పాశ్చాత్య శైలుల్ని మేళవిస్తూ, తరచూ తానే స్వయంగా సంగీతం సమకూర్చుకొనడం మరో విశేషం.

రవీంద్రనాథ్‌ టాగూర్‌ పెయింటింగ్స్‌ వల్ల చిత్రకళ మీద ప్రేమ పెంచుకున్న బుద్ధదేవ్‌కు జానపద కళలన్నా, కళారూపాలన్నా అమితమైన ఇష్టం. అందుకు తగ్గట్టే ఆయన తన ‘బాగ్‌ బహదూర్‌’ (1989) చిత్రాన్ని మన తెలుగునాట ప్రసిద్ధమైన జానపద కళారూపం పులివేషాల నేపథ్యంలో తీర్చిదిద్దడం గమనార్హం. తెలుగమ్మాయి అర్చన నటించిన ఆ సినిమా ఆ ఏటి జాతీయ ఉత్తమ చిత్రం. చిన్నప్పుడు నేతాజీని ఆరాధించి, యౌవనంలో నక్సలిజమ్‌ వైపు మొగ్గిన ఈ బెంగాలీబాబు తరువాత ఆ ప్రభావం నుంచి బయటపడ్డారు. ‘దూరత్వ’, ‘గృహజుద్ధ’, ‘అంధీగలీ’ (1984) చిత్రాల్లో ఆనాటి సంక్షుభిత సమయాలపై తనదైన సినీ వ్యాఖ్యానం చేశారు.

ఆయన చిత్రాల్లో 5 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు సాధిస్తే, ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మరో 2 సార్లు (‘ఉత్తర’, ‘స్వప్నేర్‌ దిన్‌’) జాతీయ అవార్డులు దక్కాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు అన్నీ లెక్క తీస్తే బుద్ధదేవ్‌ ఖాతాలో ఏకంగా 32 నేషనల్‌ అవార్డులు చేరడం ఓ రికార్డు ఫీట్‌! సత్యజిత్‌ రే మరణానంతరం భారతీయ సినిమాను మళ్ళీ అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఘనత కూడా బుద్ధదేవ్‌దే!! టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ‘మాస్టర్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ సినిమా’ విభాగంలో ఏకంగా 8 సార్లు చోటు దక్కించుకున్నారు. ఆయన సృజనాత్మక కృషికి గుర్తింపుగా, 2008లో స్పెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో జీవన సాఫల్య పురస్కారం దక్కింది.

యౌవనంలో బుద్ధదేవ్‌ను మలిచి, సినిమా వైపు మళ్ళించింది కలకత్తా ఫిల్మ్‌ సొసైటీ. అక్కడ చూసిన చార్లీ చాప్లిన్, అకిరా కురసావా, విటోరియో డెసికా, రొసెల్లినీ లాంటి ప్రసిద్ధుల చిత్రాలు. అంత బలమైన ముద్ర వేసిన ఫిల్మ్‌ సొసైటీ ఉద్యమంతో బుద్ధదేవ్‌ చివరి దాకా సన్నిహితంగా మెలిగారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినా, చివరి వరకు ఫిల్మ్‌ సొసైటీ ఉద్యమంలో సిన్సియర్‌ యాక్టివిస్ట్‌గానే పనిచేశారు. దేశంలోని ఏ మారుమూల, ఏ ఫిల్మ్‌ సొసైటీ కార్యక్రమానికి పిలిచినా కాదనకుండా, ఆయన స్వయంగా వెళ్ళేవారు.

బుద్ధదేవ్‌ సతీమణి సోహిణీ దాస్‌గుప్తా కూడా దర్శకురాలే. ఇద్దరమ్మాయిలకు జన్మనిచ్చిన వారిది అన్యోన్య దాంపత్యం. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, కిడ్నీ సమస్యతో కన్నుమూసే వరకు బుద్ధదేవ్‌ కవిత్వాన్నీ, సినిమానూ శ్వాసిస్తూ వచ్చారు. ఒక్క మాటలో– బుద్ధదేవ్‌ ఓ అద్భుతమైన దర్శకుడు. అపూర్వమైన కవి. అమోఘమైన టీచర్‌. అన్నిటికీ మించి మనసున్న మంచి మనిషి. ఆ వ్యక్తిత్వం పరిమళించిన ఆయన సృజనాత్మక కృషి ఎప్పటికీ వసివాడని జ్ఞాపకం.
– రెంటాల జయదేవ

 

మరిన్ని వార్తలు