పెద్దపల్లి జిల్లా మీసేవ ఆపరేటర్‌ హత్యకేసులో సంచలన విషయాలు 

29 Nov, 2021 03:48 IST|Sakshi

 ‘కోల్డ్‌ కేస్‌’ సినిమా చూసి హత్యకు ప్లాన్‌ చేసినట్టు ఒప్పుకున్న నిందితుడు? 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘కోల్డ్‌ కేస్‌’ అనే మలయాళీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా చూసి.. అచ్చం అలాగే హత్యకు ప్లాన్‌ చేశాడు. పక్కా ప్లాన్‌తో యువకుడిని హతమార్చి, తల ఒకచోట.. ఇతర శరీర భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఇక పోలీసులకు దొరికేదే లేదనుకున్నాడు. కానీ, సదరు హంతకుడిని పోలీసులు పక్కాగా పట్టేశారని సమాచారం. అతడిని విచారించగా, సంచలన విషయాలు బయటపడ్డాయని తెలిసింది.

కేసును సవాల్‌గా తీసుకున్న రామగుండం కమిషనరేట్‌ పోలీసులు కొందరిచ్చిన సమాచారంతో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారని తెలిసింది. ఈ క్రమంలో తానెలా హత్య చేసిందీ, శరీరభాగాలను ఎక్కడెక్కడ విసిరేసిందీ నిందితుడు చెప్పినట్లు సమాచారం.  

అసలేం జరిగిందంటే.. 
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ పరిధి ఖాజీపల్లికి చెందిన మీసేవ ఆపరేటర్‌ కాంపెల్లి శంకర్‌ శనివారం దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. అతడి మృతదేహాన్ని ముక్కలుచేసిన నిందితుడు గోదావరిఖని వన్‌టౌన్, టూటౌన్, ఎన్టీపీసీ, బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో శరీరభాగాలు పడేశాడు. మృతుడి తల, చేయి రాజీవ్‌రహదారి సమీపంలోని మల్యాలపల్లి స్టేజీ వద్ద ఉన్న ముళ్లపొదల్లో లభించాయి. ఈ క్రమంలోనే అనుమానితుడైన రాజు ఉండే క్వార్టర్‌ను పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్య సమయంలో ధరించిన దుస్తులు, ఉపయోగించిన వస్తువులను క్వార్టర్‌ ప్రాంగణంలోనే నిందితుడు కాల్చేసినట్లు గుర్తించారు. 

‘కోల్డ్‌కేస్‌’ సినిమా చూసి.. 
‘కోల్డ్‌కేస్‌’ సినిమాలోని లాయర్‌ పాత్రధారి.. తన క్లయింట్‌కు భరణం కింద వచ్చిన డబ్బును కాజేయాలనే అత్యాశతో సదరు క్లయింట్‌ను హత్యచేసి శరీరభాగాలను పాలిథిన్‌ కవర్లలో చుట్టి కేరళ, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో విసిరేస్తుంది. వేర్వేరు పోలీçస్‌స్టేషన్ల పరిధిలో శరీరభాగాలు దొరకడంతో అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ కేసు మిస్టరీగానే మిగిలిపోతుంది. ఈ సినిమా ప్రేరణతోనే శంకర్‌ హత్యకు ప్లాన్‌ చేసినట్టు నిందితుడైన రాజు విచారణలో చెప్పినట్టు తెలిసింది.

రాజు, శంకర్‌ భార్య, మరికొందరి ప్రమేయం హత్య వెనుక ఉన్నట్లు ప్రచారమవుతున్నా.. తానొక్కడినే ఈ పనిచేసినట్లు రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధంతో పాటు కొన్ని అభ్యంతరకర ఫొటోలను రాజు వాట్సాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే శంకర్‌ హత్యకు గురయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సైకోలా ప్రవర్తన 
కొన్నేళ్ల క్రితం భార్యతో గొడవపడిన రాజు ఒక్కడే ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లో ఉంటున్నాడు. మద్యం, గంజాయికి అలవాటుపడిన అతడి ప్రవర్తన సైకోలా ఉంటుందని పలువురు చెబుతున్నారు. హత్య చేసినప్పటి దుస్తులతోనే మర్నాడు స్థానిక టిఫిన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లగా కొందరు వాసన గుర్తుపట్టి నిలదీయగా తాను వాంతులు చేసుకోవడం వల్ల వాసన వస్తోందని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడని సమాచారం.   

మరిన్ని వార్తలు