అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా!

14 May, 2022 10:34 IST|Sakshi

సాక్షి,పహాడీషరీఫ్‌(హైదరాబాద్‌): నీడ కోసం రాతి గుండు పక్కన కూర్చుంటే ప్రాణం పోయింది.. మహిళపై గుండు పడటంతో చనిపోయింది. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగనాయకుల కాలనీకి చెందిన ఇరుగదిండ్ల మౌనిక(25), నిరంజన్‌ దంపతులు. రోజూ మాదిరిగానే శుక్రవారం నిరంజన్‌ మామిడిపల్లి దానం గుట్టపై రాళ్లు కొట్టేందుకు వెళ్లాడు.

మధ్యాహ్నం సమయంలో భర్తకు భోజనం తీసుకుని మౌనిక అక్కడకు వెళ్లింది. టిఫిన్‌ ఇచ్చిన తర్వాత సమీపంలోనే ఉన్న ఓ రాతి గుండు నీడన కూర్చుంది. అంతలోనే గుండు ఒక్కసారిగా ఆమెపై పడింది. భర్తతో పాటు తోటి కార్మికులు వెంటనే బండను పక్కకు తీసి చికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.

లారీ ఢీకొట్టడంతోనే...? 
గ్రానైట్‌ లోడ్‌ తీసుకెళ్లేందుకు వచ్చిన లారీని రివర్స్‌ తీసుకునే క్రమంలో డ్రైవర్‌ వెనుకనుంచి గుండును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. లారీ ఢీకొనడంతో గుండు దొర్లి మౌనికపై పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని మృతురాలి బంధు,మిత్రులు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. వర్షం కారణంగా కింద ఉన్న మట్టి జరగడంతో గుండు దొర్లినట్లు మౌనిక భర్త ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

చదవండి: రేషన్‌లో మినీ సిలిండర్లు

మరిన్ని వార్తలు