బంజారాహిల్స్‌: ఆస్ట్రేలియాకు పంపుతానని రూ. 9 లక్షల మోసం 

27 Nov, 2021 10:10 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ఆస్ట్రేలియాకు పంపిస్తానని రూ. 9 లక్షలు దండుకున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 14లోని నందినగర్‌లో నివసించే బదావత్‌ వినయ్‌ నాయక్‌(19) ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేశాడు. తన స్నేహితుడు గండి సాయి కిరణ్‌ తన మామ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడని తాను కూడా వెళ్తున్నానని నువ్వు కూడా వస్తే ఇద్దరం వెళ్దాం అని చెప్పాడు. ఇందుకు తన తండ్రి కమల్‌ను పరిచయం చేశాడు.

రూ. 9 లక్షలు ఖర్చు అవుతుందని కమల్‌ చెప్పగా కమల్‌ రెండు విడతలుగా వినయ్‌ నాయక్‌ రూ. 9 లక్షలు ఇచ్చాడు. అయితే నెలలు గడుస్తున్నా ఆస్ట్రేలియా ప్రయాణం జరగలేదు. ఆరా తీయగా గతంలో చాలా మందిని కమల్‌ మోసం చేసినట్లుగా తేలింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు కమల్‌ నిరాకరించడమే కాకుండా ముఖం చాటేయడంతో తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ పేరుతో మోసం 
హిమాయత్‌నగర్‌: బీమా ప్రీమియం కట్టకుండానే అకౌంట్‌ నుంచి డబ్బులు స్వాహా అయ్యాయని శుక్రవారం ఓ వ్యక్తి సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సైదిరెడ్డి సమాచారం మేరకు... హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఐసీఐసీఐ ఇన్సూ్యరెన్స్‌ కట్టేందుకు లాగిన్‌ అయ్యాడు. ఒక్కోటి ఫిల్‌ చేస్తుండగా.. మధ్యలో ఫిల్లింగ్‌ ఆపేశాడు. కొద్దిసేపటికి తన ఎస్‌బీఐ అకౌంట్‌లో నుంచి కొంత డబ్బులు కట్‌ అయ్యాయి.

ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు గూగుల్లో దొరికిన ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ నంబర్‌కు ట్రై చేశాడు. కొద్దిసేపటికి ఓ వ్యక్తి ఎస్‌బీఐ కస్టమర్‌ కేస్‌ సెంటర్‌ నుంచి అంటూ కాల్‌ చేశాడు. మొబైల్‌లో ఎనీడెస్క్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించాడు. వివరాలు అన్నీ తెలుసుకుని, ఓటీపీ చెప్పాక అకౌంట్‌లోంచి రూ. 4.50 లక్షలను స్వాహా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.   

మరిన్ని వార్తలు