జీఎస్‌టీతో పన్ను చెల్లింపుదారులు రెట్టింపు

2 Jul, 2021 14:33 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల నాలుగేళ్ల కాలంలో పన్ను చెల్లింపుదారులు రెట్టింపయ్యారని, 1.28 కోట్లకు చేరుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన పన్నుల వసూలు ఇక మీదటా మెరుగ్గా ఉండడం సాధారణమేనని చెప్పారు. జీఎస్‌టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పన్ను అధికారులకు మంత్రి లిఖిత పూర్వక సందేశం ఇచ్చారు. ఈ తరహా సంస్కరణను భారత్‌ వంటి పెద్ద, వైవిధ్యమైన దేశంలో అమలు చేయడం అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు. 

జీఎస్‌టీ పన్ను చెల్లింపుదారులకు నిబంధనల అమలును సులభతరం చేయడమే కాకుండా సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించినట్టు వివరించారు. జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెలలోనూ రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి. మోసపూరిత డీలర్లు, ఐటీసీకి సంబంధించి ఎన్నో కేసులను వెలుగులోకి తీసుకువచ్చినట్టు మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. నాలుగేళ్ల కాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 66.25 లక్షల నుంచి 1.28 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. 

పరోక్ష  పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) 2020 నవంబర్‌ నుంచి పెద్ద ఎత్తున సోదాలు చేపట్టి నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ), రూ.29,000 కోట్ల జీఎస్‌టీ ఎగవేతలను గుర్తించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు. జీఎస్‌టీ అమలులో ఎన్నో సవాళ్లను అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారుల మద్దతు పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. 

రాష్ట్రాల మద్దతుతో జీఎస్‌టీలోకి పెట్రోలియం 
జీఎస్‌టీని ఎంతో అవసరమైన పన్నుల విధానంగా కేంద్ర ఉపరితల, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. జీఎస్‌టీ దినోత్సవం రోజున ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన వెబినార్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జీఎస్‌టీని ఇంకా మెరుగుపరచడానికి అవకాశాలున్నాయంటూ.. భాగస్వాముల మద్దతుతో ఈ పనిచేస్తామని చెప్పారు. సమాఖ్య దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాల సమ్మతి అవసరమన్నారు.

చదవండి: కరోనా కాలంలోనూ కరెంట్‌ ఖాతా మిగులు

మరిన్ని వార్తలు