ఏమండోయ్ నాని గారు.. క్షమాపణలు చెప్పించండి

17 Oct, 2020 17:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించగా.. తాజాగా కేశినేని గత ఐదేళ్ల కాలాన్ని స్వర్ణయుగమంటూ వ్యాఖ్యానించడంపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని గుర్తుచేసి.. చంద్రబాబు చేత క్షమాపణలు చెప్పించండని అన్నారు. (ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం)

‘ఏమండోయ్ నాని గారు (కేశినేని నాని).. చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగి పోయి, నాడు బీజేపీని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు. రోజుకు పదికోట్ల ప్రజల సోమ్ముతో ధర్మపోరాటం, ఆరాటమని ఢిల్లీలో దీక్షలు చేశారు. నేడు మీరేమేూ గత ఐదేళ్లు స్వర్ణ యుగం, కేంద్ర మంత్రులందరు ఏపీకి అండగా నిలిచారని చెప్పారు (కేంద్రం ఇచ్చింది నిజమేలే). తన స్వార్థ రాజకీయూల కోసమే బీజేపీపై తప్పుడు ప్రచారం చేశానని చంద్రబాబు గారితో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి. అయినాగాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి’ అంటూ విష్ణువర్ధన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

కాగా శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ ఫ్లె ఓవర్‌ ప్రారంభం సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై కేశినేని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ అండతోనే వంతెన నిర్మాణం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. అయితే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి గానీ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దికిగానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కపార్టీలోనే ఇద్దరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కార్యకర్తలు సైతం విస్మయానికి గురవుతున్నారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా